సముద్రం
- vinoo Sparkles
- Nov 19, 2024
- 2 min read

నిన్ననే నేను సముద్రాన్ని మొదటిసారి చూశాను. కవుల వర్ణనలకన్నా, కథల్లో కనిపించే విషాద దృశ్యాలకన్నా అది పూర్తి భిన్నంగా కనిపించింది. ఒంటరిగా చూసి ఉంటే నిజంగా మృత్యు
ఘోషలా, విషాద గీతంలా ధ్వంసంమైన స్వప్నాలన్నీ ఆ తీరంలో గుర్తొచ్చేవేమో. కానీ అలా జరగలేదు. ఎదురుగా సముద్రం, పక్కనే మీరు. 'మీరు' అని కాకుండా ఈ ఒక్కసారికి ‘నువ్వు’ అని అంటాను. పక్కనే నువ్వు. ఆ సముద్రం అందంగా, మధురంగా అనుభవమైంది.
అది ఊహించని అనుభూతి కూడా. వానకురిసి బీచ్ రోడ్ అంతా తడిగా ఉంది. అక్కడక్కడ మాత్రమే చినుకులు పడుతున్నాయి. అప్పుడే ఇద్దరం కలిసి తీరానికి వెళ్లాం. మొట్టమొదటిసారి కళ్లెదురుగా సముద్రం.. దూరంగా ఎత్తులో అలలు ఎగిసిపడుతున్నాయి. వాటికి తోడు సముద్రపు హోరు. అది వినిపించగానే తెలియకుండా నేను మిన్నకుండిపోయాను.
నువ్వు కాస్త నానుంచి ముందుకెళ్లి, వెనక్కి తిరిగి చూశావు. అక్కడి నుంచి నన్ను పిలిచావు. సముద్రపు హోరులోనుంచి నా పేరు వినిపించింది. తేరుకొని ముందుకు కదిలాను. మీరు నా చేయి పట్టుకొని అలల తీరంలోకి తీసుకెళ్లారు. పక్కపక్కనే ఇద్దరం. సముద్రానికి ఎదురుగా నిల్చున్నాం. నా ధ్యాసంతా సముద్రం పైనే. దూరంగా ఉన్న కడలి అంచును చూస్తున్నాను. తుఫానులా కనబడాల్సిన కెరటాలు అందంగా కనబడుతున్నాయి. నాకేమైందో!
సముద్రం నాకు ఇంత అందంగా కనిపించడానికి కారణం.. మంచి స్నేహితురాలిగా నువ్వు పక్కన ఉండటమే అని నాకు అప్పుడప్పుడే అర్థమవుతోంది. ఆ క్షణమే ఓ అల ఇద్దరి పాదాలపై నుంచి సుతారంగా వెనక్కివెళ్లింది.
అప్పుడు నువ్వు నా చేయి మరింత కంట్రోల్ గా పట్టుకున్నావు. నా చెవిలో ఎదో అన్నావు. నాకు వినబడలేదు. మరో అల తాకింది.
"జాగ్రత్త. పాదాలకింద ఇసుక జారిపోతూ ఉంటుంది" అని చెప్పావు.
నువ్వలా అనగానే సన్నటి ఇసుక పాదాల కింద నిజంగా జారిపోవడాన్ని ఎక్స్ పీరియన్స్ చేశాను. చాలామంది సముద్రాన్ని చూస్తారు, ఆనందిస్తారు. కానీ ఇంత దగ్గరుండి సముద్రాన్ని చూపిస్తున్నావు. నేను ఆ ఆనందాన్ని వింతగా అనుభవిస్తున్నాను. అప్పుడే నువ్వు ఒక అలకు ఎదురువెళ్లి 'వినో...ద్' అని అరిచావు. అది సముద్రమంతా వినబడింది. తర్వాత నాకు కూడా.
ఎందుకో తెలీదు. పక్కనెవరో ఏమీ అడగలేదు. అయినా నువ్వు కలుగజేసుకొని. 'వినోద్ సముద్రాన్ని చూడటం మొదటిసారి' అని చెప్పావు. నువ్వు గతంలో చాలా సముద్రాల్ని చూశావు. కానీ, నేను మొదటిసారి సముద్రాన్ని చూస్తుంటే నా ఆనందం తాలూకు అనుభూతి నీలోనూ కనిపించింది. ఏ కల్మషమూ లేదు. స్నేహం, ఆప్యాయతే అంతా.
ఆ సాయంత్రం వానజల్లు మళ్లీ మొదలైంది. అలల తడి, వాన చినుకులు. మార్మోగుతున్న సముద్రం. లీలగా వీస్తున్న పిల్లగాలి అందర్నీ తాకితాకి వెళ్తోంది. మనల్ని కూడా. గంటల కొద్దీ అక్కడే ఉన్నాం. సముద్ర తీరంలో ఎన్నో ఊసులు, ముచ్చట్లు.. మధురమైన గుర్తులు. ఇవన్నీ ఎన్ని రోజుల దాకా నాకు గుర్తుంటాయో తెలీదు. నేను మర్చిపోతున్నట్టు అనిపిస్తే ఒక్కసారి తట్టిలేపు. సముద్రమంత ఆప్యాయతతో నాకోసం ఈ జ్ఞాపకాలను నీ దోసిళ్లలో మోసినందుకు, సముద్రం అందంగా కనబడేలా చేసినందుకు స్నేహమా నీకు కృతజ్ఞతలు.
-వినో..
Comments